telugu navyamedia
రాజకీయ

మరోసారి చీపురుపట్టిన ప్రియాంక గాంధీ

ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లఖింపూర్ ఘటనతో ఇప్పుడు యూపీలో రాజకీయాలు వేడెక్కాయి. లఖింపూర్ ఘటనను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇప్పటికే లఖింపూర్‌లో బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను అక్కడి పోలీసులు నిర్బంధించడంతో కాంగ్రెస్‌కు మైలేజి పెరిగిందని అందరూ భావిస్తున్నారు. లఖింపూర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడి కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో
నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని పోలీసులు నిర్బంధించడంతో తన గదిని శుభ్రం చేసుకునేందుకు ప్రియాంక గాంధీ చీపురుపట్టి ఊడ్చిన వీడియోలు తెగవైరల్ అయ్యాయి. ఆమెకు ఆ పనులే సరిపోతాయిలే అనే అర్థం వచ్చేలా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేయడం వివాదంగా మారింది.

యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ ప్రియాంక గాంధీ లక్నోలోని ఓ దళితవాడలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ చీపురు పట్టి ఊడ్చి మరోసారి వార్తల్లోకి వచ్చారు. దానిని ఒక ఆత్మగౌరవ చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని జిల్లా కమిటీలు వాల్మీకి దేవాలయంను శుభ్రం చేస్తాయని ట్వీట్ చేశారు. సీఎం యోగిని ఉద్దేశిస్తూ ఆయన మాటల ద్వారా నన్ను ఒక్కరినే అవమానించలేదు. ఈ పనిచేసే కార్మికులందరినీ అవమానించారు అని ప్రియంక అన్నారు. మీతోపాటు నేనుకూడా ఈ పనిచేసేందుకు ఇక్కడకు వచ్చాను. పరిసరాలను శుభ్రం చేయడం, చీపురు పట్టడం ఆత్మగౌరవ చర్య అని తెలియజేసేందుకే వచ్చానని పారిశుధ్య కార్మికులనుద్దేశించి ప్రియాంక గాంధీ ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో తలపడి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Related posts