ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1న నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ తేదీని పరిగణనలోకి తీసుకోలేదు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అక్టోబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పరిగణించాలని కొందరు.. లేదు…ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1నే కొనసాగించాలని మరికొందరు.. ఆరోజు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేనందున అది సరికాదని ఇంకొందరు వాదించారు.
గత ప్రభుత్వం ఇవేవీ కాకుండా.. రాష్ట్ర విభజన జరిగిన జూన్ రెండో తేదీ నుంచి.. ప్రభుత్వం ఏర్పడిన జూన్ 8వ తేదీవరకు నవ నిర్మాణ దీక్షల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. ఏపీసీఎం జగన్ నవంబరు ఒకటో తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఈ నెల 21న సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారు. పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.