కేంద్ర ప్రభుత్వం దేశంలో సమర్థంగా పనిచేసే టాప్-10 పోలీస్ స్టేషన్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ పోలీస్ స్టేషన్‌కు స్థానం దక్కడం గమనార్హం. కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్ ఈ జాబితాలో 8వ స్థానంలో నిలవడం విశేషం. అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్‌దీన్ పోలీస్ స్టేషన్ తొలి స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో బాలా సినోర్(గుజరాత్), మూడో స్థానంలో అజిక్ బుర్హాన్‌పూర్(మధ్యప్రదేశ్), నాలుగో స్థానంలో ఏడబ్ల్యూపీఎస్ థేని(తమిళనాడు), ఐదో స్థానంలో అనిని(అరుణాచల్ ప్రదేశ్), ఆరో స్థానంలో ద్వారక(ఢిల్లీ), ఏడో స్థానంలో బకాని(రాజస్థాన్), తొమ్మిదో స్థానంలో బిచోలిమ్ (గోవా), పదో స్థానంలో బార్‌గావా(మధ్యప్రదేశ్) ఉన్నాయి.
ఆస్తి తగాదాలు, మహిళలు, అణగారిన వర్గాలపై నేరాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను ప్రకటించారు. మొత్తం 15,666 పోలీస్ స్టేషన్ల పోటీలో పాల్గొన్నాయి. 70 ఉత్తమ పోలీస్ స్టేషన్లను కలిగివున్న తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. చొప్పదండి పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికవడంపై సీఐ రమేష్, ఎస్ఐ శేరాలు స్పందించారు. కేసుల వివరాలు ఆన్‌లైన్ చేయడంలో, పోలీసుల పనితీరు, పోలీస్ స్టేషన్‌లోని సౌకర్యాలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాల వారీగా చొప్పదండి స్టేషన్ ఉత్తమ సేవలు అందిస్తోందని కేంద్ర హోంశాఖ అధికారులు సర్వే చేసి నివేదిక అందించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి చొప్పదండి పోలీస్ స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి తమను ప్రోత్సహిస్తూ.. సలహాలు, సూచనలు అందించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.