telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ పద్మనాభం భావోద్వేగ లేఖ‌

కాపు ఉద్యమంలో భాగంగా 2016 జనవరిలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా తుని కార్యక్రమంలో పలువురు ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు సంబంధించి మరో 17 కేసులల్లో విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. కాపులపై కేసుల్ని ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో చర్చించి ఉపసంహరించుకున్నారు. 

ఈ క్ర‌మంలో  కాపు ఉద్యమ నేత,  మాజీ మంత్రిముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. కేసులు ఉపసంహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

తమ జాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా, భగవంతుడు జగన్ ద్వారా ఆ కేసులకు మోక్షం కలించారన్నారు. చాలా సంతోషంగా ఉందని.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని.. జగన్ సర్కార్ మా కాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల సమయంలో ఆ ఘటనకు సంబంధించి కేసులను మాఫీ చేస్తానని ప్రకటించిన జగన్ ..ఇచ్చిన మాట ప్రకారం మొత్తం కేసులను ఉపసంహరించుకున్నారు.

కాపులను బీసీ – ఎఫ్ లో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపినప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు తెలపాలనుకున్నా. అలా చేస్తే జాతిని పదవుల కోసం, డబ్బులు కోసం అమ్మేసుకున్నాను అని అంటారని భయపడ్డా. ఇప్పుడు కూడా ఆ భయంతోనే మిమ్మల్నీ కలవలేకున్నాను. చాలా మంది పెద్దలు రకరకాల సమస్యలతో మీ ఇరువురి వద్దకు వచ్చినా తప్పు పట్టారు. నేను మాత్రమే ఎవరినీ కలవకూడదు, నేను ఎప్పుడో చేసుకున్న పాపం అనుకుంటాను’’ అంటూ ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు చెబుతూనే ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రోవైపు  కాపు ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తొలగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, కాపు సంఘాల నేతలు జగన్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. రైలు ఘటనలో కేసులు పూర్తిగా రద్దు చేశారన్నారు. కాపు సోదరులకు మంచి జీవో ఇస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్పందించే మనసు రాలేదన్నారు.

Related posts