telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

voilance jummalamadugu ycp tdp

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సైరన్ కు సమయం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పార్టీలో చేరికలపై ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు.

ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలు, జన్మభూమి మా ఊరు కార్యక్రమాలపై దృష్టి సారించిన చంద్రబాబు ఇకపై పార్టీలో వలసలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 11 నుంచి చంద్రబాబు పార్టీ కార్యకలాపాలపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది, వైసీపీ, జనసేన పార్టీల ప్రభావం ఉన్నచోట ప్రత్యామ్నాయంగా ఎవరిని తెరపైకి తీసుకురావాలి అనే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు ఫోకస్ పెట్టారు.

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు, మాజీమంత్రి అహ్మదుల్లా, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు.

అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తెలుగుదేశం పార్టీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు సైతం ఆమెకు హామీ ఇచ్చారు.

ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు మాజీ వైసీపీ నేత ఘట్టమనేని ఆది శేషగిరిరావు సైతం త్వరలోనే సైకిల్ ఎక్కనున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెనాలి అసెంబ్లీ టికెట్ ను ఆశించారు ఆదిశేషగిరిరావు. అయితే జగన్ మాత్రం

విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఆఫర్ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే జగన్ ఆలోచనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో
టీడీపీలో చేరాలని నిర్ణయించారు.
చంద్రబాబు తమకు బంధువు కావడంతో ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి టీడీపీలో చేరాలని ఆదిశేషగిరిరావు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అటు మాజీమంత్రి అహ్మదుల్లా సైతం అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలోనే అహ్మదుల్లా సైకిలెక్కనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు అహ్మదుల్లా చేరికతో మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

అటు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఇప్పటికే పలు అంశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సబ్బం హరి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పలుమార్లు కలిసి అభినందించారు కూడా.

ఇటీవలే డిసెంబర్ 31న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో సబ్బం హరి కలిశారు. తాను టీడీపీలో చేరతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని తాను భావిస్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు చెప్పారు.

అయితే చంద్రబాబు మాత్రం సబ్బం హరిని అసెంబ్లీకి పంపాలని యోచిస్తున్నారు. దీంతో టిక్కెట్ పై ఎలాంటి క్లారిఫికేషన్ రాకపోవడంతో పార్టీలో చేరికపై సబ్బం హరి సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు పని తీరును మెచ్చుకున్న కొణతాల త్వరలోనే సైకిల్ ఎక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే జనవరి 18న తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related posts