telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దమ్ముంటే చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లాలి: కొడాలి నాని

kodali nani ycp

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు దమ్ముంటే 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. టీడీపీ 20కి 20 సీట్లు గెలుచుకుంటే తమ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. టీడీపీ ఓడిపోతే మాత్రం మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలన్నారు.

గత టీడీపీ పాలనలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు విసుగు చెందడంతోనే ప్రజలు టీడీపీని గత ఎన్నికల్లో ఓడించారని ఆయన చెప్పారు. జూమ్‌ యాప్‌లో మాట్లాడుతూ చంద్రబాబు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లలో కేవలం బాలకృష్ణను మాత్రమే చంద్రబాబు గెలిపించారని ఆయన విమర్శించారు.

అక్కడ కూడా ప్రజలు టీడీపీని వద్దనుకున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదని చెప్పారు. తెలుగు దేశం పార్టీకి కంచుకోటలా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ టీడీపీకి ప్రజలు ఓట్లు వేయలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు, సీఎం జగన్‌ నిర్ణయాల మేరకు తీసుకున్న వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని ఆయన అన్నారు.

Related posts