telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రైతుల సభకు హైకోర్టు అనుమతి ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండుతో తలపెట్టిన మహాపాదయాత్ర తిరుమలలో ముగిసింది. న్యాయస్థానం టు దేవస్థానంపేరుతో పాదయాత్రగా తిరుమల చేరుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి, రైతు సంఘాలు, ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించాలని సంకల్పించారు.

దీంతో అమరావతి రైతుల సభ నిర్వహణకు తిరుపతి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారణకు తీసుకున్న ధర్మాసనం వద్ద ఇరువర్గాల వాదనలు విని సభకు అనుమతిచ్చింది. సభను మధ్యాహ్నం ఒంటిగంటనుంచి సాయంత్రం ఆరు గంటలదాకా నిర్వహించుకోవచ్చని సూచించింది. సభ నిర్వహణలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విన్పించారు.

పాదయాత్ర సమయంలో అమరావతి రైతులు పోలీసులపై దాడి చేశారని.. అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వీడియో ఫుటేజ్ చూపించారు. అయితే ప్రైవేటు ప్రదేశంలో సభను నిర్వహించుకుంటే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇటీవల కురిసిన భారీ వర్షల కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, ఒమిక్రాన్ విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో సభకు అనుమతిచలేదని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు.

బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటచేసుకోనీకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. నిబంధనలకు లోబడి బహిరంగ సభను నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, ప్రభుత్వంపైనా, అధికారులపైనా రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు సూచించింది.

Related posts