సంచలన నిర్ణయాలతో దేశ రాజకీయాల్లో విలక్షణ ప్రధానిగా పేరుగాంచిన మోదీ కూడా ఇప్పుడు కేసీఆర్ బాటనే ఎంచుకున్నారని ఎంఐఎమ్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై అసదుద్దీన్ ట్విటర్ ద్వారా స్పందించారు.తెలంగాణ ప్రభుత్వం సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిన రైతుబంధును మోదీ సర్కార్ కాపీ కొట్టడం నిజంగా అది కేసీఆర్ ఔనత్యానికి చెందుతుందన్నారు. నిరాశలో ఉన్న రైతులకు రైతుబంధు పథకంతో ప్రాణం పోసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశ రైతాంగానికి ఆపద్భాందవుడిలా మారారన్నారు.
ఇటీవల ఇక్యరాజ్యసమితి కూడా ఆ పథకాన్ని ఎనలేని విధంగా కీర్తించింది. కరువును పారద్రోలేందుకు ఆ పథకం దివ్యౌషధమని కూడా అభిప్రాయపడింది. 130 కోట్ల భారత దేశానికి కూడా ఇప్పుడు రైతుబంధు పథకం ఎంతో అవసరమైంది. కేసీఆర్ లాంటి రాజకీయ దూరదృష్టి ఎంతైనా అవసరమని ఈ పథకంతో తెలుస్తోందన్నారు. దేశ రైతాంగాన్ని కాపాడేందుకు, వ్యవసాయ సంక్షోభాన్ని తరిమేందుకు మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలు హర్షించే కిసాన్ సమ్మాన్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.