telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తుపాకి పేల్చితే రాజీనామా చేయాలా? విపక్షాలది కక్కుర్తి రాజకీయం..

మహబూబ్‌నగర్‌ ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీ కాల్పులకు సంబంధించి విపక్షాలు చేస్తోన్న విమర్శలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. ఏ ఘటన జరిగినా విచారణ వుంటుందని.. కానీ తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్ధార్‌ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కుమురం భీం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ లాంటి మహనీయుల జయంతి వేడుకలు అన్ని వర్గాలు కలిసి చేసుకోవడం ద్వారా చక్కటి స్ఫూర్తిని చాటాలని కోరారు. అప్పుడే ఆ మహనీయుల ఆత్మ శాంతిస్తుందన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయా వర్గాలకు మేలు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 52 శాతంపైగా బీసీ జనాభా వున్న నేపథ్యంలో కేంద్రం బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై అనేక అంశాలపై శాసనసభలో తీర్మానాలు చేసి పంపినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలనే ధ్యాస తప్పించి బీజేపీ మరో పనిలేదని ఆయన మండిప‌డ్డారు.

Related posts