మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా అమరావతిలో ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు అప్రమత్తమై అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్ అనే రైతు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేస్తూ.. శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకోవడంతో అతని ప్రయత్నం విఫలమైంది.
అనంతరం రమేశ్ మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కాడు. అమరావతి నిర్మాణానికి తాను నాలుగు ఎకరాల భూమిని ఇచ్చానని చెప్పాడు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడీషియల్ రాజధానులుగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. ఏపీకి ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.