telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ కథతో మహిళా క్రికెటర్ లో స్ఫూర్తి నింపిన తండ్రి…

భారత మహిళా ఓపెనర్ ప్రియా పూనియా తల్లి ఇటీవలే కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మే 18న ప్రియా తల్లి సరోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే జూన్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనకు ప్రియాను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయగా.. జూన్‌ 2న జట్టు అక్కడికి వెళ్లనుంది. కానీ తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆమెలో స్ఫూర్తి నింపేందుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపినట్లు ఆమె తండ్రి సురేందర్‌ పేర్కొన్నారు. ఇంగ్లండ్ పర్యటన కోసం నా కుమార్తె (ప్రియా పూనియా)లో నేను స్ఫూర్తి నింపాలనుకున్నా. విరాట్ కోహ్లీకి ఎదురైన ఇలాంటి అనుభవం గురించి ప్రస్తావించా. కోహ్లీ తన తండ్రిని కోల్పోయినా.. రంజీ మ్యాచ్‌ ఆడటానికి వెళ్లాడని చెప్పా. మా కుటుంబానికి ఇది చాలా క్లిష్ట పరిస్థితి. కానీ మేం మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. జీవితంలో ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి పాప పరిస్థితులను అర్థం చేసుకుంది. నాన్నా.. నేను ఆడేందుకు సిద్ధమని చెప్పింది’ అని సురేందర్‌ తెలిపారు. అయితే మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్‌ టీమ్‌ మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇటీవలే ఎంపిక చేసింది.

Related posts