హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్బంలో బీజేపీ సభ్యులు జై శ్రీరాం, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఓవైసీ ఘాటుగా స్పందించారు. బీజేపీ సభ్యులకు తనను చూడగానే అలాంటి విషయాలు గుర్తుకురావడం మంచిదేనని అన్నారు.
అయితే వారు భారత రాజ్యాంగాన్ని, ముజ్‌ఫర్‌పూర్‌లో చిన్నారుల మరణాలను కూడా వారు గుర్తుకు తెచ్చుకుంటారని ఆశిస్తానని తనదైన శైలిలో చురకలంటించారు. మరోవైపు బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గత రెండు వారాల్లో 200 మందికి పైగా చిన్నారులు మెదడువాపు వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే. ముజఫర్‌పూర్‌లో చిన్నారుల మృతిపై విపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.