లాక్ డౌన్ లో నిబంధనలు సడలించిన తర్వాత తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల్లో లాక్ డౌన్ ను ఈనెల 28 వరకు పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.అత్యవసర, తుది విచారణ కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ఆదేశించింది.
జిల్లా మేజిస్ట్రేట్, ట్రైబ్యునల్ కోర్టుల లాక్ డౌన్ ను ఈ నెల 14 వరకు హైకోర్టు పొడిగించింది. 15వ తేదీ నుంచి ఈ కోర్టులను తెరవాలని ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.