telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ కుట్రకు తెరలేపింది…

ktr trs

రేపు హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికలో లబ్దిపొందేందుకు అబద్దపు మాటలు, అసత్య ప్రచారాలు, అర్థ సత్యాలు, డ్రామాలు, డబ్బులు అన్నీ అయిపోయాయి. దీంతో చివరి అస్త్రంగా, చివరి ప్రయత్నంగా నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి దాని ద్వారా వచ్చే సానుభూతితో దుబ్బాక ఉపఎన్నికలో ఏవో కొన్ని ఓట్లు సాధిద్దామని బీజేపీ అనుకుంటుందని ఇది మంచిది కాదు అని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకుల నుంచే తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్న మంత్రి విషయాన్ని తెలంగాణ భవన్‌లో మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..

దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విష ప్రచారం చేస్తుందన్నారు. గడిచిన 15-20 రోజులుగా ఎన్నో రకాల కుట్రలు, ప్రయోగాలకు పాల్పడిందన్నారు. అన్నీ కూడా జనం చూశారు. మొదలు కొంత డబ్బుల ప్రయోగం చేసిన్రు. ప్రజలకు పంచడానికి చేసుకున్న అన్ని ఏర్పాట్లను కూడా ఎలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో అక్కడి బృందాలు పటాపంచలు చేశాయి. ఒకసారి రూ.40 లక్షలు, ఒకసారి రూ.10 లక్షలు, తాజాగా నేడు హైదరాబాద్‌లో దుబ్బాకకు పోతున్న రూ. కోటి నగదును పోలీసులు పట్టుకున్నారు. డబ్బుల డ్రామా ఫెయిల్‌ కావడంతో ఇంకో డ్రామాను ఎత్తుకున్నరన్నరు. వాళ్ల పార్టీ అధ్యక్షుడిని ఎవరో కొట్టినరని, జరగని దాడిని జరిగిందని సృష్టించి లేనిపోని చిల్లరమల్లర రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పోలీసువాళ్లు తమ మీద దాడి చేస్తున్నరని మొదలుపెట్టిన్రు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. ఎక్కడైతే ఉపఎన్నిక జరుగుతుందో ఆ జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల ఒకటే రోజు సోదాలు జరిగాయి. ఇద్దరు బీజేపీకి సంబంధించిన నాయకుల ఇండ్ల మీద, మరో ఇద్దరు టీఆర్‌ఎస్‌కు సంబంధించిన నాయకుల ఇండ్లలో సోదాలు జరిగాయి. దీన్ని ఎట్ల ప్రచారం చేసుకున్నరంటే ఒకేరోజు 8 మంది బీజేపీ నాయకుల ఇండ్ల మీద సోదాలు జరుగుతున్నయని టీఆర్‌ఎస్‌ వాళ్ల ఇండ్లమీద జరుగుతలేవని అక్కడొక అభూత కల్పన సృష్టించారు.

డబ్బులు దొరికితే కూడా ఆ డబ్బులు తమవి కావని ప్రచారం చేయడం, ఎదురుదాడి చేయడం చేశారు. పోలీసులు వీడియోలతో సహా బయటపెట్టడంతో ఆ డ్రామా కూడా విఫలమైందన్నారు. ఆ తర్వాత భయంకరమైన అవాస్తవాలు, అభూత కల్పనలు గోబెల్‌కే పాఠాలు చేప్పె స్థాయికి సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తూ విస్తృతమైన విష ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌, దుబ్బాక టీఆర్‌ఎస్‌ ప్రచారకర్త మంత్రి హరీశ్‌రావు, కొడకండ్ల వేదికగా తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తిప్పికొట్టడంతో ఆ పన్నాగం కూడా విఫలమైందన్నారు. ప్రజలకు అసత్యాలు, అర్థసత్యాలు చెప్పి, తిప్పిని బమ్మిని చేసి ఆగమాగం చేయాలని, ప్రజలను అయోమయానికి గురిచేయాలని చూసినరో అది కూడా విఫలమైందన్నారు.

అన్నీ విఫలమవడంతో ఇక చివరి కుట్రకు తెరలేపారన్నారు. ఈ రోజు బీజేపీ ఆఫీస్‌ ముందు జరిగిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఘటన ఆధారంగా రేపు నగరంలో బీజేపీ పెద్ద కుట్రకు పాల్పడబోతున్నట్లు తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించి అయితే ప్రగతి భవన్‌ ముట్టడి గానీ లేదా డీజీపీ ఆఫీసు ముట్టడి గానీ లేదా తెలంగాణ భవన్‌ ముట్టడి గానీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేటి ఉదయం నుంచే ఆ పార్టీ కార్యకర్తలకు విస్తృతంగా సమాచారం చేరవేస్తున్నారన్నారు. ముట్టడి అంటే మామూలు ముట్టడి కాదన్నారు. అవసరమైతే లాఠీచార్జీ జరగాలి అది ఫైరింగ్‌ దాకా పోవాలి అనే ఒక ఎత్తుగడ ఆఖరి ప్రయత్నంగా, ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని రేపు భారతీయ జనతా పార్టీ చేయబోతున్నట్లు చెప్పారు.

దీంతో తమ పార్టీ తరపున పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విషయాన్ని తెలుపుతూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా బృందంగా వెళ్లి డీజీపీని అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి విన్నవించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నట్లు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో ఆరేండ్లుగా అద్భుతంగా ఉన్న శాంతి భద్రతలకు ఎవరూ విఘాతం కలిగించే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో తొక్కిపారేయాలని తమ పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికలు వస్తాయి, పోతాయి. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలనే తూటాలకు అడ్డంపెట్టి పోలీసు ఫైరింగ్‌ దాకా తీసుకునిపోయి దాని నుండి వచ్చే సానుభూతితో లాభం జరగాలని ఎవరూ చూసిన తెలంగాణ సమాజం హర్షించదన్నారు. ఇంత లేకిగా, ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్న బీజేపీని నీతిని కూడా గమనించాల్సిందిగా దుబ్బాక ప్రజలకు కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Related posts