కృష్ణానది నీటి కేటాయింపులు, వినియోగం, విడుదలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఈలు బాబూరావు, మనోహర్‌రాజు, తెలంగాణ నుంచి ఎస్‌ఈ ఆర్.వి. ప్రకాష్, డిప్యూటీ ఈఈ ఎస్.శ్రీధర్‌కుమార్, కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రాజెక్టుల ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు వాడుకున్న నీటి వినియోగం, రబీ పంట కాలానికి అవసరమయ్యే నీటి కేటాయింపులు, పంపకాలు, ఇతర ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించారు. పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్, నాగార్జునసాగర్ ఎడమకాలువ, కృష్ణాడెల్టా సిస్టం ప్రాజెక్టుల నుంచి కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ అధికారులు తోసిపుచ్చారు. పోతిరెడ్డిపాడు నుంచి 18 టీఎంసీలు, కేసీ కాలువ నుంచి 8.5 టీఎంసీలు వాడుకున్నట్లు చెబుతున్నప్పటికీ… అంతకంటే ఎక్కువ నీరు వాడుకున్నారని తెలంగాణ అధికారుల వాదించారు.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీరు భారీగా సముద్రంలోకి వృథాగా వెళ్లిందని.. ఆన్ అండ్ ఆఫ్ సిస్టం అమలు చేసిన దృష్ట్యా సముద్రంలోకి వెళ్లడం అనివార్యమైందని ఏపీ అధికారులు సమర్థించుకున్నారు. ఈవిషయంలో 21 టీఎంసీల వినియోగం తేడా కనిపించింది. నాగార్జునసాగర్ (ఎన్‌ఎస్‌పీ) ఎడమ కాలువ మినహా మిగతా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారుల వాదనతో ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం ఏకీభవించలేదు. ఇప్పటి వరకు ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువ నుంచి తెలంగాణ 17 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 11 టీఎంసీలు వాడుకున్నట్లు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. ఈ ఏడాది రబీ సీజన్ దృష్ట్యా… మే వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ 150 టీఎంసీలు, తెలంగాణ 79 టీఎంసీలు కావాలని ఇండెంట్ పెట్టాయి. మిగతా నీటి విడుదల లెక్కలు తేలాల్సి ఉంది. మళ్లీ ఈ నెల 15న మరోసారి సమావేశం కావాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది.
ప్రజల విశ్వాసాన్ని వైసీపీ పొందలేకపోతుంది: పురందేశ్వరి