కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో ఆయన ఒక ద్రోహిగా మిగిలిపోతారని ప్రభాకర్ విమర్శించారు. అవసరం ఉన్నా, లేకున్నా.. ఏ అంశమైనా ట్విటర్‌లో స్పందించే కేటీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించలేదు అని ప్రశ్న వేశారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విట్టర్ రావుగానే బాగా ప్రచారంలోకి వచ్చారని పొన్నం అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వానికి ఆ మాత్రం పట్టడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇవ్వలేదా అని ఆయన అడిగారు.
50 వేల ఆర్టీసీ కార్మికుల బాధ మీకు కనబడటం లేదా? ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డు మీదకు వస్తాయి? అని కూడా ఆలోచించ లేదా ?ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల వెంటనే కేటీఆర్ వారి స్పందన తెలపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చిన కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగా కాకుండా కల్వకుంట్ల కోతలరావుగా మిగిలిపోతారని అని తెలిపారు. ఆర్టీసీ సమస్యలపై స్పందించికపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో ఒక పెద్ద ద్రోహిగా కేటీఆర్ మిగిలిపోతారని పొన్నం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని… సమస్య పరిష్కారమయ్యే వరకు టీఆర్ఎస్‌ను నిద్రలో కూడా వెంటాడుతుందని అన్నారు. కార్మికులు అన్ని పార్టీల మద్దతుకు యత్నిస్తున్నారు.