ఓటరు లిస్ట్ లో పేరు లేదని సామాన్యులు అల్లాడిపోతుంటే, ప్రముఖులు మాత్రం ఓటు లేకపోయినా, ఓటు వేసి, ఫొటోకు ఫోజులు ఇచ్చేస్తున్నారు. తాజాగా అలా ఫోజు ఇచ్చి, కోలీవుడ్ ప్రముఖ నటుడు శివకార్తికేయన్ చిక్కుల్లో పడ్డాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18న రెండో విడత ఎన్నికలు జరిగాయి. ఓటు వేసేందుకు భార్యతో కలిసి చెన్నైలోని వలసరవాకం పోలింగ్ బూత్‌కు వెళ్లిన నటుడు, ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులపై మండిపడ్డాడు. తన ఓటు తీసేశారని, ఇది దుర్మార్గమంటూ మీడియా ముందుకొచ్చి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి భార్య పేరు ఉండడంతో ఆమె మాత్రం ఓటు వేసింది. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇంతలోనే మళ్లీ శివ కార్తికేయన్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం వివాదాస్పదమైంది. ఓటు వేసినట్టు వేలిని చూపిస్తూ ఓ ఫోటోను సోషల్ మీడియాలోనూ పోస్టు చేశాడు. తొలుత ఓటు లేదని హంగామా చేసి ఇప్పుడు ఓటు ఎలా వేశారంటూ మీడియా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరైన నటుడు ప్రత్యేక అనుమతితో వచ్చి ఓటేశానని వివరణ ఇచ్చాడు. విషయం కాస్తా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. ఎన్నికల అధికారులకు సైతం నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని పేర్కొంది.