కరోనా వైరస్ చాలా వేగంగా విజృంభిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో వైరస్ సూపర్ స్ప్రెడ్డర్లు తయారయ్యారని, వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపారు. అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు.
పుల్లువిలాలో 97 శాంపిల్స్ పరిశీలించగా, 51 మందికి, పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా, 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తిరువనంతపురంలో పరిస్థితి భయాన్ని కలిగిస్తోంది. ఇక్కడి తీర ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించి, ప్రత్యేక పోలీసు టీమ్ లను, పౌర సేవల విభాగాన్ని రంగంలోకి దించాం. వారు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారని విజయన్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కేరళలో 6 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 42 కేసుల విషయంలో వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం ఇప్పటికీ తెలియకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఈ విషయాన్ని వెల్లడించిన పినరయి విజయన్, తిరువనంతపురంలో కరోనా కట్టడికి ఈ నెల 6 నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. సామూహిక వ్యాప్తి కనిపించిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు.
అందుకే జగన్ ను హైదరాబాద్ నుంచి కేసీఆర్ తరిమేశారు: రాజేంద్రప్రసాద్