ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కాటుకు వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ ను అరికట్టేందుకు భారతదేశం పోరాటం చేస్తుంది. వైరస్‌ను నియంత్రంచడంలో భాగంగా స్వీయ గృహ నిర్బంధాన్ని విధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ అనే కాన్సెప్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు దేశం మొత్తం ఐక్యంగా స్పందించింది. ఏకతాటిపై నిలిచింది. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసింది.
ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి లవ్ అగర్వాల్ జనతా కర్ఫ్యూ వ్యూహకర్తగా వ్యవహరించారని తెలుస్తోంది. 1996 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం ఏపీ కిందికే వచ్చారు. ప్రస్తుతం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలాకాలం కిందటే కేంద్ర సర్వీసులకు వెళ్లిన లవ్ అగర్వాల్ ప్రస్తుతం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
లవ్ అగర్వాల్ గతంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌తో కలిసి కొల్లేటి సరస్సులో ఆక్రమణలను తొలగించడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ లెక్క చేయలేదు. ఆక్రమణల బారి నుంచి కొల్లేటి సరస్సును విముక్తి చేశారు.