telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గ్రేటర్‌లో బీజేపీ-జనసేన పొత్తు..!

pawan

హైదరాబాద్‌ :‌ రాజధానిలో రాజకీయ వేడెక్కింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ రాజకీయ రణరంగంలోకి దిగాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, కాం‍గ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం ప్రధాన పార్టీలుగా బరిలో నిలవగా.. పవన్‌ కళ్యాన్‌ నేతృత్వంలోనే జనసేన పార్టీ కాస్త ఆలస్యంలో రంగంలోకి దిగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో తాము పోటీచేస్తున్నామని పవన్‌ ఇటీవల ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉండదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో పవన్‌ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని జనసేన తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపింది. గ్రేటర్‌లో పొత్తు గురించి ఇరువురు నేతలు చర్చించనున్నారు. దీనిపై ఇరు పార్టీల నేతల భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే జనసేనతో పొత్తుపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే అభ్యర్థుల జాబితాను బీజేపీ సిద్ధం చేయగా.. పొత్తు అనంతరం ఏ విధంగా మార్పులు చేస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని సంజయ్‌ ఇదివరకే ప్రకటించారు. తాజాగా పవన్‌ ప్రకటన నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు వ్యవహారం సందిగ్ధంలో పడింది. పవన్‌ తీరుపై బీజేపీ నేతల అసంతృప్తి : పవన్‌ కల్యాణ్‌తో బండి సంజయ్‌ భేటీ ఉంటుందని జనసేన ప్రకటన బీజేపీ నేతలను షాకింగ్‌కు గురిచేసింది. తమకు తెలియకుండానే పవన్‌ మీడియాకు లీకులిస్తున్నారని ఆ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ తీరుపై బీజేపీ నేతల అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు భేటీపై బండి సంజయ్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇక పవన్‌తో దోస్తీకి దూరంగా ఉండాలని పలువురు బీజేపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts