నేడు ఇరాన్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమాన సిబ్బందితోపాటు 176 మంది మృతిచెందారు. అయితే ఈ విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయని, ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపిన ఉక్రేయిన్ ప్రతినిధులు.. ఆ తర్వాత కొద్దిసేపటికే విరుద్దమైన ప్రకటన చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
విమాన ప్రమాదం జరిగిన చోట రెండు బ్లాక్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. వాటిని బోయింగ్ సంస్థకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు వార్తలు ప్రచురించాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్షిపణి దాడి కారణంగానే విమాన ప్రమాదం జరగి ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్‌లు చేస్తున్నారు. అలాగే రెండు రోజుల క్రితమే ప్రమాదానికి గురైన విమానానికి సాంకేతిక పరీక్షలు నిర్వహించామని బోయింగ్ సంస్థ తెలిపింది. ఇలా పలు సందేహాలు తలెత్తడంతో.. విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు