ప్రజావేదిక కూల్చివేత చివరి ఘట్టానికి చేరుకున్నప్పటికీ, దానిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఇటు వైసీపీ, అటు టీడీపీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజావేదిక వద్దకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికను నిర్మించిన స్థలం రైతులను బెదిరించి బలవంతంగా లాక్కుకున్నారని ఆళ్ల తెలిపారు.
చంద్రబాబు, నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ లు రైతులు దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావులపై స్థలం కోసం తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు.చివరికి బెదిరించి సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి 2015లో తహసీల్దార్, 2016లో హైకోర్టు నోటీసులు ఇచ్చాయన్నారు. అయినా వాటిని చంద్రబాబు పట్టించుకోలేదనీ, అక్రమ నిర్మాణాలు కొనసాగించారని చెప్పారు. ప్రజావేదిక కూల్చేవేతపై రాద్ధాంతం అనవసరమని, చట్టాలకు ఎవరూ అతీతులు కాదని ఆళ్ళ స్పష్టం చేశారు.