బ్రిటిష్ పార్లమెంట్ సమావేశాలను అక్టోబర్ 14 వరకూ సస్పెండ్ (ప్రోరోగ్) చేసినట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. వచ్చే నెలలో జరగాల్సిన ప్రతిపాదిత నోడీల్ బ్రెగ్జిట్‌ను అడ్డుకునే బిల్లును ఆమోదించిన పార్లమెంట్ అక్టోబర్ 15న పార్లమెంట్ ఎన్నికలు జరపాలన్న ప్రధాని జాన్సన్ ప్రతిపాదనను తిరస్కరించింది. బ్రెగ్జిట్ ప్రణాళికలపై ప్రైవేట్ కమ్యూనికేషన్లు విడుదల చేయాలని ప్రధానిని ఆదేశించింది. బ్రెగ్జిట్‌పై ప్రధాని జాన్సన్‌కు, పార్లమెంట్ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన అనంతరం ఇప్పటికే రెండు సార్లు తిరస్కరించిన బ్రెగ్జిట్ బిల్లును పార్లమెంట్ మూడోసారి కూడా తిరస్కరించింది.
బ్రెగ్జిట్ బిల్లును, పార్లమెంట్ ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరించిన తరువాత పార్లమెంట్‌ను ప్రభుత్వ వినతి మేరకు అక్టోబర్ 14 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎటువంటి పరిశీలనా లేకుండానే తన ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదముద్ర పొందేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాధారణంగా పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదంతో ప్రకటించాల్సిన ప్రోరోగ్ ప్రక్రియ ఈ సారి అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదాలతో రసాభాసగా మారింది.
ప్రభుత్వం తమ నోళ్లు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని, ఇది సిగ్గుచేటైన విషయమని హౌస్‌ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. పార్లమెంట్ సస్పెన్షన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కామన్స్ సభ స్పీకర్ జాన్ బెర్కో, పార్లమెంట్ ప్రోరోగ్ చేసేందుకు ఇది ప్రామాణికమైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. గత కొన్ని దశాబ్దాల కాలంలో పార్లమెంట్‌ను ఇంత సుదీర్ఘకాలం ప్రోరోగ్ చేయటం ఇదే తొలిసారని, ఇది ప్రభుత్వ భయాందోళనలను ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.