telugu navyamedia
క్రీడలు

ఊరించిన విజయం… మ్యాచ్ డ్రా….

ఊరించిన విజయం చేజారిపోయింది. కాన్పూరు వేదికగా జరిగిన క్రికెట్ టెస్టుమ్యాచులో న్యూజీలాండ్ తో తలపడి భారత క్రికెట్ జట్టు అన్ని విభాగాల్లోనూ శక్తియుక్తుల్ని ప్రదర్శించింది. బ్యాటింగ్ లో దూకుడు తగ్గించిన న్యూజిలాండ్ వికెట్లను కాపాడుకుంటూ… కాలయాపన చేయడంతో వ్యూహాత్మ్ంగా టెస్టుమ్యాచును డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్సులో ప్రతిభా సామర్థ్యాలను కనబరచిన టీమిండియా… అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది.

టెస్టుమ్యాచులో ఆరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన రికార్డును నమోదుచేశారు. తొలి ఇన్నింగ్సులో సెంచరీ చేయడంతోపాటు రెండో ఇన్నింగ్సులో అర్థ సెంచరీ చేసి సత్తాచాటాడు. ఇలా అద్భుతమైన ప్రదర్శన చేసి తొలి భారతీయ అటగాడిగా ప్రపంచ క్రికెట్ రికార్డుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓవరాల్ గా ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

అక్షర్ పటేల్ , రవిచంద్రఅశ్విన్, రవీంద్రజడేజా బౌలింగ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్సులో అక్షర్ పటేల్ న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లను ఆటకట్టించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు ధాటిగా ఆడటంతో 151 పరుగులకు తొలివికెట్ నమోదైంది.

టీమిండియా తొలి ఇన్నింగ్సులో 345 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్సులో ఏడు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్సులో 296 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్సులో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ టామ్ లేథమ్ అద్భుతమైన ఆటతీరుతో తొలి ఇన్నింగ్స్ లో 282 బంతులు ఎదుర్కొని 10 బౌండరీలతో 95 పరుగులు చేసి సెంచరీకి 5 పరుగుల దూరంలో వెనుదిరిగారు. రెండో ఇన్నింగ్సులోనూ అద్భుతమైన ఆటతీరుతో 146 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతో ఆచీతూచి ఆడి అర్థశతకాన్ని పూర్తి చేశాడు. టామ్ లేథమ్ 52 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ తొలి ఇన్నింగ్సులో 64 బంతుల్లో 18 పరుగులు నమోదుచేయగా… రెండో ఇన్నింగ్సులో 112 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేశారు.

Related posts