telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విపత్తులో సర్కారు పనితీరు భేష్..

రాయలసీమలో భారీ వర్షాలు, విపత్తు సమయంలో ప్రభుత్వ పనితీరు బాగుందని కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించింది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వరద విపత్తు నష్టాలను అధ్యయనంచేసిన బృందం తాడేపల్లి ముఖ్యమంత్రికార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వరదనష్టం అంచనాలతో నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర బృందం పేర్కొంది. ఎన్‌ఎండీఏ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ సలహాదారు కునాల్‌ సత్యార్థి వరదలతో ఇబ్బంది పడిన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అక్కడి పరిస్థితులు మనసు కలచివేశాయని పేర్కొన్నారు.

వరదలతో పంటనష్టం, జంతునష్టం, ప్రాణనష్టం, ప్రాజెక్టులు, చెరువులు, వంతెనలు దెబ్బతిన్న విషయాలను నమోదు చేసుకున్నామన్నారు. కూలిపోయిన భవనాలతో నిరాశ్రయులైన తీరు బాధకలిగించిందనే విషయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. గ్రామీణప్రాంత రోడ్లు రూపురేఖలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు ఛిద్రమైపోయాయని నివేదికలో పొందుపరచారు. క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది.

గ్రామాల్లో విపత్తు సంభవించినపుడు, యువకులు స్పందించిన తీరును కేంద్ర కమిటీ అభినందించింది. రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సంపూర్ణంగా సహకారం అందించారని కేంద్రకమిటీ పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలుకురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమేగాకుండా… ఆస్థినష్టం ఎక్కువగా జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.

Related posts