కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. అయినపటికీ కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 2183కి చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. అయితే, ఆ కొద్ది సేపటికే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ప్రకటన చేసింది.
ఇప్పటివరకు దేశంలో మొత్తం 2,301 కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 2088 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారని తెలిపింది. 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇప్పటివరకు 157 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని వివరించింది.