telugu navyamedia
క్రీడలు వార్తలు

దహన సంస్కారాల కోసం లైన్లలో నిలబడటం చూసి బాధపడ్డాను : వార్నర్

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించిన బీసీసీఐ.. చివరకు ఆటగాళ్లకు వైరస్ సోకడంతో నిరవధికంగా వాయిదా వేసింది. లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు త్వరగానే తమ ఇళ్లకు చేరుకున్నా.. ఆసీస్ ప్లేయర్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గత సోమవారమే ఇంటికి చేరుకున్న డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ సందర్భంగా భారత్‌లో కనిపించిన దృశ్యాలు కలిచివేశాయి. బాధితుల ఆక్సిజన్ కష్టాలు, దహన సంస్కారాల కోసం బాధిత కుటుంబ సభ్యుల క్యూ లైన్లు టీవీల్లో చూసి చాలా బాధపడ్డాను. ఈ దృశ్యాలను మ్యాచ్‌ కోసం మైదానం వెళ్లే ముందే చూశాను. గుండె తరుక్కుపోయింది.’అని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక లీగ్‌ను వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని కూడా అభిప్రాయపడ్డాడు. లేకుంటే విదేశీ ఆటగాళ్లు భారత్ నుంచి వెళ్లడం మరింత సవాల్‌గా మారేదన్నాడు. భారత్‌లోని కరోనా పరిస్థితుల కారణంగా ఇతర దేశాలన్నీ రాకపోకలపై నిషేధం విధించాయని, దాంతో తాము వీలైనంత త్వరగా అక్కడి నుంచి రావాల్సి వచ్చిందన్నాడు. మాలాంటి సమస్యనే ఎదుర్కొన్న మిగతా ఆటగాళ్లు కూడా మాల్దీవులకు వచ్చారని తెలిపాడు. ఇక కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.

Related posts