telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టెక్సాస్ లో … భారీ పేలుడు.. కిలోమీటర్లమేర వినిపించిన శబ్దం..

huge blast in texas state

అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ సిటీ శివారులో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధం వినిపించడం, దాని ధాటికి వందలకొద్దీ అపార్ట్‌మెంట్లలో సీలింగ్ ఫ్యాన్లు, అద్దాలు విరిగిపడటంతో ప్రజలు భయంతో హాహాకారాలు చేశారు. అగ్నికీలకలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల జనం ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. రెస్క్యూటీమ్‌లతోపాటు ఫైరింజన్లు, ఆంబులెన్స్‌లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపుచేయడంతోపాటు స్థానికుల్ని ఖాళీచేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హ్యూస్టన్ సిటీ శివారులోని గెస్నర్ రోడ్డులోని వాట్సన్ గ్రైండింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ ఉంది. శుక్రవారం తెల్లవారుజామున అక్కడ సడెన్ గా భారీ పేలుడు చోటుచేసుకుంది.

పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల బిల్డింగ్స్, అపార్ట్ మెంట్లు దద్దరిల్లిపోయాయి. కేటీఆర్‌కే అనే స్థానిక డిజిటల్ టీవీ ముందుగా ఈ వార్తను ప్రసారం చేసింది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన చాలా మంది బాధితులు వీడియోలు, ఫొటోలు కేటీఆర్‌కే ట్విటర్‌కు షేర్ చేశారు. పేలడు సంభవించిన గెస్నర్ రోడ్డు, దాని పరిసర ప్రాంతాలను పోలీసులు సీజ్ చేశారు. అటుగా వాహనాలు రావొద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ ఆంక్షలు జారీచేశారు. కాగా, కేటీఆర్‌కే రిపోర్టు ప్రకారం.. తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తిని ఆంబులెన్స్ లో తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఎంతన్నది తెలియాల్సిఉంది. పేలుడు జరిగినప్పుడు ఫ్యాక్టరీలోపల ఎవరైనా ఉన్నారా? లేరా?, అసలీ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది.

Related posts