ప్రజలు కరోనా వైరస్ పై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం సరికాదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… దేశంలో ప్రతి రోజు ఏకంగా 75 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రికవరీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని కోరారు.
భారత్‌లో రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని చెప్పారు. మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 1.82 శాతంగా ఉందని వివరించారు. దేశంలో ఇప్పటి వరకు 4 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి గురించి స్థానిక నాయకులందరూ అవగాహన కల్పించాలని ఆయన కోరారు.