telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్లపై దాడి.. విధులు బహిష్కరణ

karona ward in gandhi hospital

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే కరోనా రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువు విధి నిర్వహణలో ఉన్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్లపై దాడికి దిగాడు. ఆసుపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 6న కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో ఓ బాధితుడు చేరాడు. అతడి బంధువు అతడికి కేర్ టేకర్‌గా అక్కడే ఉన్నాడు. కాగా, పరిస్థితి విషమించడంతో గత రాత్రి 8 గంటల సమయంలో రోగి మరణించాడు. అతడి మరణాన్ని జీర్ణించుకోలేని బంధువు వైద్యుల నిర్లక్ష్యమే అందుకు కారణమని ఆరోపించాడు. అక్కడితో ఆగక విధి నిర్వహణలో ఉన్న జూనియర్ వైద్యులపై దాడిచేశాడు.

అతడి తీరుతో విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు జూనియర్ వైద్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అవుట్ పోస్టు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడికి నిరసనగా జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న అడిషనల్‌ సీపీ చౌహాన్, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌లు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో చర్చలు జరిపినప్పటికీ విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు.

Related posts