ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతకు మరింత చేరువయ్యాడు. భారత్‌లో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచాడు. ఈ విజయంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ స్వదేశంలో ఇప్పటివరకు 28 టెస్టులు ఆడగా అందులో 21 విజయాలు సాధించింది. అలాగే రెండు ఓటములు చవిచూసి, ఐదు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. మరోవైపు మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా భారత్‌లో 30 మ్యాచ్‌లు ఆడి మూడు ఓటములు, ఆరు డ్రాలతో 21 విజయాలు సాధించింది. దాంతో ధోనీ సరసన కోహ్లీ నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో విరాట్ మాజీ కెప్టెన్ మహీని అధిగమించే వీలుంది. కాగా, ప్రస్తుత సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసుకుంది. తర్వాతి మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఈనెల 24 నుంచి ప్రారంభంకానుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కోహ్లీ ధోనీని అధిగమించి కొత్త రికార్డు సృష్టిస్తాడు. చెన్నై వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక టెస్టుల్లో టీమిండియా 300 పైచిలుకు పరుగుల తేడాతో గెలుపొందడం చరిత్రలో ఇది ఆరోసారి. అందులో ఐదు విజయాలు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో సాధించినవే కావడం విశేషం.
previous post
next post