telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

Pranabh Mukarjee Bharata Ratna Award

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని భారతరత్న పురస్కారం వరించింది. ఆయనతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్‌ముఖ్‌, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్‌ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని శుక్రవారం రాష్ట్రపతి భవన్ కార్యాలయం ప్రకటించింది.

2012 నుంచి 2017 భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్‌ దా.. కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల్లో వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా.. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలికి 23 ఏళ్లపాటు సీడబ్ల్యూసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బందుల్లో పడినపుడల్లా ట్రబుల్‌ షూటర్‌గా వ్యవహరించి గట్టెక్కించారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్‌ సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు

భారతరత్నపై కేసీఆర్‌ హర్షం:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్‌ ముఖర్జీ పూర్తి అర్హుడని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్‌ ముఖర్జీ తీసుకున్న చొరవను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు.

Related posts