telugu navyamedia
రాజకీయ

వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభ అట్టుడికిపోయింది. ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ నిరసనలు చేపట్టారు. దీంతో తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

 ప్ర‌తిప‌క్షాల తీరుకు స‌భ‌ని వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌భ‌ని స‌జావుగా సాగేలా చూడాల‌ని కోరారు. మొదట సభలు ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు నివాళి అర్పించారు. లోక్​సభలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్​ ఓం బిర్లా.

వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా… వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే సభలో విపక్షాల ఎంపీలు నిరసనలు తెలుపుతుండగానే సాగుచట్టాల రద్దు బిల్లును కేంద్రమంత్రి తోమర్ ప్రవేశపెట్టగా.. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

అయితే ఈ వినతిని తోసిపుచ్చిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. చర్చ లేకుండానే మూజువాణి ఓటింగుతో బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. మధ్యాహ్నాం రెండు గంటలకు సభ తిరిగి సమావేశం కానుంద‌ని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. టీఆర్ఎస్ తో పాటు కొన్ని విపక్షాలు నిరసనలు తెలుపుతూ గ్యాలరీలోకి వెళ్లారు. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఇవేవి ప‌ట్టించుకోకుండా బిల్లు ను ప్రవేశ పెట్టింది.

Related posts