సీఎం కార్యాలయం 10న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నోట్ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తో ఆయన సమాలోచన చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కేబినెట్ నిర్వహణపై అధికారులతో ఆయన చర్చించినట్టు సమాచారం. కేబినెట్ భేటీలో ఏ అంశాలపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలని కోరానని, ఈసీ నిబంధనలను సీఎం చంద్రబాబుకు వివరించాలని సూచించినట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. కేబినెట్ అజెండాను స్క్రీనింగ్ చేసి ఈసీకి పంపుతామని, ఈ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. కేబినెట్ అజెండా పరిశీలనకు కనీసం 48 గంటల సమయం పడుతుందని చెప్పారు.
ఏపీ ప్రభుత్వ కేబినేట్ మీటింగ్ గురించి చీఫ్ సెక్రటరీకి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందించారు. ఎన్నికల కోడ్ కు లోబడే కేబినెట్ సమావేశం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నాయకులు, అధికారులు అందరూ ఎన్నికల కోడ్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పారు. ఇప్పటికే అన్ని పార్టీలకు, అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పుస్తకాలు పంపామని తెలిపారు. ఈ పుస్తకాల్లో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. ఏవైనా అనుమానాలు ఉంటే సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదు: విజయసాయి రెడ్డి