telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ బాలికకు తలనొప్పే ప్రాణాంతకంగా మారింది…!

Girl

అమెరికాలోని మిచిగాన్‌లో 14 ఏళ్ల బాలిక సవన్నా డిహార్ట్ ఈ నెల ప్రారంభంలో మొదట తలనొప్పి అంటూ మంచం పట్టింది. అలా చిన్న తలనొప్పితో మంచం పట్టిన కూతురు రోజుల వ్యవధిలోనే కదలలేని స్థితికి చేరిందని ఆమె తల్లి కెర్రి డూలే తెలిపింది. 15 రోజుల వ్యవధిలోనే సవన్నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆమెను ఈ నెల 17న కలమజూలోని బ్రాన్సన్ పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన అక్కడి వైద్యులు ప్రాణాంతకమైన దోమల ద్వారా సంక్రమించే వ్యాధితో బాధపడుతుందని వెల్లడించారు. బెర్రియన్, కలమజూ కౌంటీల్లో ఇలాగే ముగ్గురు ఈ అరుదైన ఈస్ట్రన్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ వైరస్ (ఈఈఈ) బారినపడినట్టు సోమవారం రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన కూతురిని ఈ పరిస్థితిలో చూస్తానని అనుకోలేదంటూ డూలే కన్నీటి పర్యంతమైంది. వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రం అంచనా ప్రకారం ఈ అరుదైన ఈస్ట్రన్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ వైరస్(ఈఈఈ)కు చికిత్స లేదని తెలుస్తోంది. మసాచుసెట్స్‌లో కూడా ఇలాగే నలుగురు ఈ వైరస్ బారినపడ్డారని అధికారులు వెల్లడించారు. రోజురోజుకు ఈఈఈ కేసులు పెరుగుతుండడంతో అధికారులు దీని నియంత్రణపై దృష్టిసారించారు. అసలు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో కనుగొనే పనిలో పడ్డారు.

Related posts