telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లిని కడసారి చూసేందుకు పంపకపోగా… ఒంటె పాలు పితకమంటూ…

Camel

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మకతాపల్లికి చెందిన పాలేటి వీరయ్య రెండేళ్లుగా సౌదీ అరేబియా-జోర్డాన్‌ సరిహద్దులోని ఓ ఒంటెల క్షేత్రంలో కాపరిగా పనిచేస్తున్నాడు. అక్కడ 100కు పైగా ఒంటెలుండగా.. ఇటీవల 30 ఒంటెలు ఈనాయి. ఆ ఒంటెల పాలు పిండకపోతే.. వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజానికి ఒంటెల పాలు పిండటం అందరికీ సాధ్యం కాదు. ఆ క్షేత్రంలో చాలామంది భారతీయులు పనిచేస్తున్నటికీ వీరయ్య మాత్రమే ఒంటె పాలు పిండగలడు. వీరయ్య జానపద పాటలు పాడుతుంటే ఒంటెలు పులకించి పోయి పాలిస్తుంటాయి. ఇదే ఆ అరబ్బు యజమాని వద్ద వీరయ్యకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇటీవల వీరయ్య తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. ఆమెకు తలకొరివి పెట్టి, రుణం తీర్చుకునేందుకు స్వదేశానికి పంపించాలని వీరయ్య తన యజమానిని ప్రాధేయపడ్డాడు. అందుకు ఆ యజమాని నిరాకరించాడు. ‘‘నీ తల్లి రుణం సరే.. నువ్వు లేకపోతే నా ఒంటెల పాలు ఎవరు పితుకుతారు’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. సూడాన్‌ నుంచి కొత్త కాపరి వచ్చే వరకు సెలవు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు.

వీరయ్య సమస్యను అతని కుటుంబీకులు ట్విటర్‌ ద్వారా కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ వారి నుంచి ఎలాంటి బదులు రాలేదు. దీంతో ఎలాగైనా తన తల్లిని కడచూపు చూడాలని భావించిన వీరయ్య పారిపోయి భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు చిక్కడంతో వారు తిరిగి యజమానికి అప్పగించారు. వీరయ్య ఫోన్‌ లాక్కొన్న ఆ యజమాని.. అతడిని ఒంటెల క్షేత్రంలో నిర్బంధిండంతో బాహ్యప్రపంచంతో వీరయ్యకు సంబంధాలు తెగిపోయాయి. ఆ ఒంటెల క్షేత్రంలోనే బిక్కుబిక్కుమంటున్న వీరయ్య.. తన తల్లి రుణం తీర్చుకునేందుకు అవకాశం కల్పించాలని తోటి భారతీయులను దీనంగా వేడుకుంటున్నాడు.

Related posts