telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మమతే బెంగాల్ పరిస్థితులకు కారణం .. : ఆరెస్సెస్ చీఫ్ …

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌, పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే కారణమని ఆరోపించారు. అక్కడ నెలకొన్న శాంతి భద్రతల సమస్య తనని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ”బెంగాల్‌లో జరుగుతున్న సంఘటనలు వాటంతట అవే జరగుతున్నాయా? అక్కడ జరుగుతున్న హత్యల వెనక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు తరచూ చనిపోతున్నారు. కానీ, ఈ దారుణాలకు ఒడిగడుతున్న వారు ఎవరన్న దానిపై మాత్రం ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు” అని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ ఆరెస్సెస్‌ కార్యక్రమంలో భగవత్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరవాత భగవత్‌ మాట్లాడిన తొలి సమావేశం ఇదే.

భగవత్‌ బెంగాల్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనల్ని ఎలాగైనా నియంత్రించాలని మమతా బెనర్జీని కోరారు. అలాగే దేశంలో మరెక్కడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. దేశం అభివృద్ధి వైపుగా దూసుకెళ్తున్న తరుణంలో కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నాయని ఆరోపించారు. ఇది ప్రజల సంక్షేమానికి అడ్డంకిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, రాజకీయాలపై ప్రజలకు క్రమంగా అవగాహనా స్థాయి పెరగుతోందని.. అందుకే నాయకుల ఎంపికలో అత్యంత విజ్ఞత కనబరుస్తున్నారన్నారు. అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే నాయకులకే అధికారం కట్టబెడుతున్నారన్నారు. అందుకే ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకునే నాయకుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుందన్నారు.

Related posts