telugu navyamedia
రాజకీయ

ఎన్‌డీఏ రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా ఆదివాసి మ‌హిళా ద్రౌపది ముర్ము..

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు స‌మావేశం లో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 20 మంది పేర్లు పరిశీలించిన తర్వాత ముర్మును ఖరారు చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించలేదని నడ్డా పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ముర్మును ఎంపిక చేసినట్లు తెలిపారు.ద్రౌపది ముర్ము మంత్రిగా, గవర్నర్ గా పనిచేశారని గుర్తుచేశారు. ఆమె విశేష ప్రతిభాశాలి అన్నారు.

కాగా. ఆదివాసీ మహిళ అయిన ముర్ము 2015-2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్‌ శాఖల మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ముర్ము టీచర్‌గా పని చేశారు.

ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు.ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ఆమె సంతాల్ కుటుంబానికి చెందినవారు. ద్రౌపది ముర్ము భర్త శ్యామ్ చరణ్ ముర్ము, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులను ఓ ప్రమాదంలో కోల్పోయారు.

ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. వివాదాలు లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు. రాష్ట్రపతి రేసులో నిలిచిన తొలి గిరిజన మహిళగా ఆమె నిలిచారు. జూన్ 25న ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామపత్రాలను సమర్పించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

ద్రౌపది ముర్ము సమాజ సేవకు అంకితం చేశారు – ప్రధాని మోదీ 

ద్రౌపది ముర్ము తన జీవితాన్ని సమాజానికి సేవ చేసేందుకే అంకితం చేశారని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
పేదలు, అణగారిన అట్టడుగు వర్గాల వారి సాధికారత కోసం కృషి చేశారన్నారు. ఆమెకు గొప్ప పరిపాలనా అనుభవం ఉందన్నారు. ఆమె మన దేశానికి గొప్ప అధ్యక్షురాలు అవుతారన్నారు. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా పేదరికాన్ని అనుభవించిన కష్టాలను ఎదుర్కొన్న వారికి ద్రౌపది ముర్ము గొప్ప స్ఫూర్తి అన్నారు. విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయగల స్వభావం మన దేశానికి ఎంతో మేలు చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు..

Related posts