దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటీవల పంజాబ్ నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన 85 మంది వలస కూలీలను బీహార్ రాష్ట్రం కతియార్ జిల్లాలోని రిషి భవన్ క్వారెంటైన్ కేంద్రానికి తరలించారు. అనంతరం అధికారులు క్వారెంటైన్ సెంటర్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వారిలో నుంచి 22 మంది తాళం పగులగొట్టుకుని వెళ్లిపోయారు. దీంతో పారిపోయిన కూలీలను గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
క్వారెంటైన్ కేంద్రంలో సరైన భోజన, వసతి సౌకర్యం లేకపోవడంవల్లే వారు పారిపోయారని తోటి వలస కూలీలు చెబుతున్నారు. ఈ ఘటనతో ప్రతిపక్ష ఆర్జేడీ కూడా నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన బీహారీలకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆర్జేడీ ఆరోపించింది.