అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ కు చేరుకున్నారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ అహ్మదాబాద్ కు చేరుకున్నారు.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అశేష జనవాహిని మధ్య 22 కి.మీ. సాగే భారీ రోడ్‌షోలో ఇరువురు నేతలు పాల్గొంటారు.మార్గమధ్యంలో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
అనంతరం నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన మోతెరా స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరవుతారు భారత్‌కు ట్రంప్ రావడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్ తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూస్తారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా స్వాగత వేడుకలను నిర్వహిస్తున్నారు.