అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక నౌకాశ్రయంలో సౌదీ ఎయిర్‌ఫోర్స్ ట్రైనర్ కాల్పులు జరపడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ప్రతిస్పందించిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని హతమార్చారు. నేవల్ ఎయిర్‌స్టేషన్ పెన్సకోలాలో ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ కాల్పుల్లో మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ కాల్పుల పై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో కొందరు సౌదీ పౌరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.