telugu navyamedia
క్రీడలు వార్తలు

నిన్నటి మ్యాచ్ లో రెండు రికార్డులు అందుకున్న రబాడ..

నిన్న ఐపీఎల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఇచ్చిన 180 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ తమ ఓపెనర్ ధావన్ సెంచరీ సహాయంతో చేధించింది. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ లో ఏడో విజయం నమోదుచేసిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటిస్థానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ పేసర్ కాగిసో రబాడ ఒక్క వికెట్ తీసి రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు ఐపీఎల్ లో 49 వికెట్లతో ఉన్న రబాడ చెన్నై బాట్స్మెన్ ఫఫ్ డు ప్లెసిస్ ను ఔట్ చేయడంతో ఐపీఎల్ లో అతి తక్కువ మ్యాచ్ లలో 50 వికెట్లు తీసిన ఆటగాడిగా మాత్రమే కాకుండా అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో 27వ మ్యాచ్‌ లోనే 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు రబాడ. దాంతో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డును రబాడ అధిగమించాడు. నరైన్ 32వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అలాగే ముంబయి పేసర్‌ లసిత్‌ మలింగ 33 మ్యాచ్‌ల్లో ఆ ఘనత సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంతుల పరంగా చూస్తే రబాడ కేవలం 616 బంతుల్లో ఈ రికార్డు అందుకోగా అంతకముందు ఈ రికార్డు 749 బంతులతో ముంబై ఇండియన్స్ పేసర్ మలింగా పేరు మీద ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి అందరికన్నా ముందున్నాడు రబాడ.

Related posts