telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ధరణి పోర్టర్‌పై సీఎం కేసీఆర్‌ కీలక అంశాలు వెల్లడి…

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సిఎం చెప్పారు.

వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్ది పాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సిఎం ప్రకటించారు. ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు సిఎం వెల్లడించారు.  ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సిఎం ఆదేశించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  మంత్రులు కెటి రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శేషాద్రి, కార్యదర్శి స్మితా సభర్వాల్, మీ సేవ సిఇవో వెంకటేశ్వర్ రావు, రెవెన్యూ వ్యవహారాల నిపుణులైన రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు రామయ్య, సుందర్ అబ్నార్, రఫత్ అలీ, కలెక్టర్లు వెంకట్రాం రెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మర్రి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Related posts