telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బిటెక్ రవి అరెస్ట్ : నిప్పులు చెరిగిన చంద్రబాబు…

chandrababu tdp

టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై ధ్వజమెత్తిన చంద్రబాబు… బిటెక్ రవి అరెస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళ హత్యాచారం దుర్ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ దుర్ఘటనకు కారకులైన నిందితులపై చర్యలు తీసుకోకుండా, దీనిని వెలుగులోకి తెచ్చిన టిడిపి నాయకులను అరెస్ట్ చేయడం గర్హనీయమని మండిపడ్డారు. ఎస్సీలపై, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం కింద కేసులు పెట్టడం మరో దుర్మార్గ చర్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చట్టబద్ద పాలన(రూల్ ఆఫ్ లా) లేదనడానికి ఇదే తార్కాణమని.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ఇది పరాకాష్ట అని తెలిపారు. ‘‘ఛలో పులివెందుల’’ కార్యక్రమం నిర్వహించారన్న అక్కసుతోనే టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారని.. బాధితులకు అండగా ఉండటం టిడిపి నాయకుల నేరమా..? అని ప్రశ్నించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడం టిడిపి నాయకుల అపరాధమా..? ఎస్సీలపై దమనకాండకు పాల్పడేవాళ్లపై చర్యలు తీసుకోరా..? అని నిలదీశారు. నెలరోజుల క్రితం ఎస్సీ మహిళపై హత్యాచారానికి పాల్పడిన వాళ్లపై ఇంతవరకు చర్యలు తీసుకోరా..? దానిని నిలదీసిన వాళ్లపై అక్రమ కేసులు బనాయిస్తారా…? అని ప్రశ్నించారు. ఈ దుశ్చర్యలవల్లే నేరగాళ్లు ఇంకా చెలరేగి పోతున్నారని.. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో నిందితులు నిర్భీతిగా తిరుగుతున్నారన్నారు. బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు, అదేమని ప్రశ్నించిన గొంతులను నొక్కేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.
ప్రజల ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నారని.. ఈ దుర్మార్గ చర్యలను రాష్ట్ర ప్రజలంతా గర్హించాలన్నారు. వైసిపి ప్రభుత్వ దమనకాండను అన్నివర్గాల ప్రజలు నిరసించాలని… బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. .

Related posts