నేడు హస్తినలో తలపెట్టిన ధర్మపోరాట దీక్ష సందర్భంగా నరేంద్ర మోదీ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తోందని పోరు బాటకు దిగిన చంద్రబాబు, కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని, కేంద్రం చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ ప్రభుత్వానికి చివరి మూడు రోజులు మాత్రమే మిగిలాయని అన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా, వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ లను వెంటనే మంజూరు చేసి మాట నిలుపుకోవాలని సూచించారు. మరో మూడు రోజుల తరువాత కేంద్రం చేయడానికి మరేమీ మిగలదని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో, ఆపై సార్వత్రిక ఎన్నికల నిమిత్తం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుందన్న ఉద్దేశంతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మారాలని, ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలని హితవు పలికారు.