తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. సీఎంతో ఆయన సతీమణి శోభకు స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వున్న సంగతి తెలిసిందే. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనే చింతమడక గ్రామానికి కూడా ఎన్నికలు జరిగాయి.
తన వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న సహస్ర మహా చండీయాగంలో నిమగ్నమై ఉన్నందునే కేసీఆర్ దంపతులు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటును వేయలేకపోయారు. సరిగ్గా యాగం ప్రారంభమైన సమయంలోనే ఓటింగ్ జరగడంతోనే ఆయన వెళ్లలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చింతమడక గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.