ఓ విద్యార్థి పేదరికంలో మగ్గుతూ కూడా తన కష్టం గురించి బాధపడుతూ కూర్చోలేదు. హక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్ ఓ రోజు పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాను ధరించిన చొక్కా అపరిశుభ్రంగా ఉంది. మరో చొక్కా వేసుకుందామంటే అదీ చిరిగిపోయింది. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉండగా.. ఒక జత మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది.
దీంతో మంజునాథ్ యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్ చెప్పాడు. కుమారుడిని హైకోర్టు న్యాయవాది అజిత్ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్ ఈ ఏడాది మార్చి 25న రిట్ వేశాడు. ఇదే యువతలో రావాల్సిన మార్పు, కానీ రేపటి తరం లో అయినా వచ్చినందుకు సంతోషం. ప్రభుత్వం చేత పని చేయిచుకోవడం తెలియాలి. లేదంటే స్వతంత్ర భారతంలో ఇంకా బానిసలుగానే బ్రతకాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.