telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

వరసిద్ధి వినాయకుడికి.. ఉండ్రాళ్ళ తయారీ ఇలా..

ganesh prasad preparation tips

సెప్టెంబర్ 2న వరసిద్ధి వినాయక వ్రతం.. ఆరోజు గణేశునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం చాలా సహజం. అయితే ఆ ఉండ్రాళ్ళు పలు పదార్దాలతో తయారుచేస్తుంటారు. వాటి తయారీ విధానం గురించి తెలుసుకొని, గణేశుని మెప్పించి, జీవితంలో అడ్డంకులను దాటేద్దాం!!

* బెల్లంకుడుములు :

కావలసినవి
బియ్యప్పిండి – ఒక కప్పు
నీళ్లు – ముప్పావు కప్పు
ఏలకుల పొడి – అర టీ స్పూను
బెల్లం తరుగు – ఒక కప్పు
నెయ్యి – ఒక టీ స్పూను
పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు

తయారీ
స్టౌ మీద బాణలిలో బెల్లం తరుగు, నీళ్లు వేసి బాగా కలుపుతూ బెల్లం కరిగించి దింపేయాలి ∙బియ్యప్పిండి వేస్తూ ఆపకుండా కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, కొబ్బరితురుము జత చేయాలి ∙అన్నీ బాగా కలపాలి (మిశ్రమం గట్టిగా ఉంటే ఉండ్రాళ్లు గట్టిగా వస్తాయి) నెయ్యి జత చేసి, కలియబెట్టి, చల్లారనివ్వాలి ∙కుకర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేసి, ఒక పాత్రలో ఉంచాలి ∙మరుగుతున్న నీళ్లలో ఈ పాత్ర ఉంచాలి ∙మూత పెట్టి, సుమారు పది నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙భగవంతుడికి నివేదన చేసి ఆరగించాలి.

* జొన్నకుడుములు :

కావలసినవి
జొన్నరవ్వ – ఒక కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – కొద్దిగా

తయారీ
స్టౌ మీద మందపాటి పాత్రలో నూనె కాగాక, జీలకర్ర వేసి వేయించాలి ∙కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙మంట తగ్గించి, నీళ్లలో జొన్నరవ్వ వేస్తూ కలపాలి ∙మూత పెట్టి పదినిమిషాల తరవాత దింపేయాలి ∙చల్లారాక ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని కుడుములు తయారు చేయాలి ∙వినాయకుడికి నైవేద్యం పెట్టి, ప్రసాదంలా తినాలి.

* ఫ్రైడ్‌మోదకాలు :

కావలసినవి
గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని

ఫిల్లింగ్‌ కోసం
బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులువేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు

పైభాగం తయారీ
ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి.

ఫిల్లింగ్‌ తయారీ
ఫిల్లింగ్‌ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి.

మోదకాల తయారీ
గోధుమపిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్‌ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్ని పక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

* పల్లీమోదకాలు :

కావలసినవి
పల్లీలు – ఒక కప్పు; బెల్లం తరుగు – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – 4 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి తురుము – పావు కప్పు

పైభాగం కోసం
బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పిండి కలపడం కోసం నీళ్లు – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – ఒక టీ స్పూను.

తయారీ
∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను వేయించాలి ∙చల్లారాక పొట్టు తీసేయాలి ∙మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా మిక్సీ పట్టాలి ∙బెల్లం తరుగు, ఏలకుల పొడి జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి.

పైభాగం తయారీ
∙స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఒక టీ స్పూను నెయ్యి, చిటికెడు ఉప్పు జత చేయాలి ∙బియ్యప్పిండి జత చేసి, స్టౌ ఆర్పేయాలి ∙కిందకు దింపి గరిటెతో బాగా కలపాలి ∙కొద్దికొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, చెయ్యి తడి చేసుకుంటూ చిన్న పూరీలా ఒత్తాలి ∙పల్లీ మిశ్రమాన్ని చిన్న ఉండలా చేసుకుని, మధ్యలో ఉంచి అంచులు మూసేయాలి ∙మోదకాల మౌల్డ్‌లో ఉంచి కొద్దిగా ఒత్తి, జాగ్రత్తగా బయటకు తీయాలి ∙ కుకర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను ఇడ్లీ రేకులలో ఉంచి, ఇడ్లీ స్టాండును కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి (విజిల్‌ పెట్టకూడదు) ∙స్టౌ మీద ఉంచి పావు గంట తరవాత దింపేయాలి.

* బియ్యపు రవ్వ ఉండ్రాళ్లు :

కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ

తయారీ: స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేగాక, కరివేపాకు వేసి వేయించాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙పచ్చి సెనగ పప్పు జత చేసి కలిపి నీళ్లు మరిగించాలి ∙మంట తగ్గించి, బియ్యం రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ ఉండకట్టకుండా కలుపుతుండాలి ∙మూత ఉంచి పది నిమిషాలయ్యాక దింపేయాలి ∙ చల్లారిన తరవాత ఈ పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ, ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడి పూజ చేసి, ఉండ్రాళ్లను బొజ్జ గణపయ్యకు నివేదించి, ప్రసాదంగా తినాలి.

Related posts