ఇటీవల జరిగిన భైంసా అల్లర్లపై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఎంతో మంది ఇళ్లు కాలిపోతే చిన్న లొల్లి అని చెప్పడం కేసీఆర్‌కు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే భైంసాకు రావాలనిసవాల్ విసిరారు. ఇది గల్లి లొల్లా.. పెద్ద లొల్లా నిరూపిస్తామని వ్యాఖ్యానించారు. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావు భైంసా ప్రాంతంలో పర్యటించారు.
అల్లర్ల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ సంజయ్.. ఎంఐఎం పార్టీ అంతరాష్ట్ర దొంగల ముఠా అని అన్నారు. .మళ్లీ అల్లర్లు పునరావృతం అయితే.. అంతే స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. భైంసాలో ఔరంగజేబు, శివాజీకి మధ్య పోరు సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.