telugu navyamedia
క్రీడలు వార్తలు

త్వరగా ఇంగ్లాండ్ వెళ్తున్న భారత జట్టు…

ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని తెలిసింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ 22-24 మందితో టీమిండియాను ప్రకటించనుందని సమాచారం. ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను బీసీసీఐ బోర్డుకు సెలక్టర్లు సమర్పించారట. దానిని బట్టే బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. వచ్చే వారం చివర్లో న్యూజిలాండ్‌తో తలపడబోయే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో ప్రస్తుతం భారత్‌ నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో కోహ్లీసేనను ప్రత్యేక విమానంలో బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపించనుంది. వెళ్లగానే ఆటగాళ్లు బ్రిటన్‌లో పది రోజులు క్వారంటైన్‌లో ఉంటారు. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లో కోహ్లీసేన తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ భారత్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక దాదాపుగా నెల రోజుల సమయం ఉంటుంది. అప్పుడు ఐదు టెస్టుల కోసం కోహ్లీసేన సన్నద్ధం కానుంది. మరోవైపు జూన్‌ 2న ఆరంభమయ్యే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ 20 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఇక కోహ్లీసేనతో తలపడే ప్రపంచ టెస్టు సిరీస్‌ ఫైనల్‌ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ మాసంలో ఇంగ్లండ్ సిరీస్‌ ముగిశాక బహుశా అక్కడే ఐపీఎల్‌ 2021 రెండో దశ ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది.

Related posts